Revanth Reddy: కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు 1 y ago
TG: తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలకపాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకుని పార్టీ పేరు కూడా మార్చుకున్నారని చెప్పారు. చేసింది చాలు.. ఇక ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారని తెలిపారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదని సీఎం విమర్శించారు. ఫామ్ హౌస్లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. పదేళ్లపాటు ఏమీ చేయని బిఆర్ఎస్ నేతలు... ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. ఏడాదిలోనే మేం ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పదేళ్లపాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు. ఇచ్చిన వాటి మీద వాళ్లే కేసులు వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదని చెప్పారు. మా ప్రభుత్వం రాగానే వాటిని పూర్తిచేశామని రేవంత్ వ్యాఖ్యానించారు.
చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాం అని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి రూ.2కోట్ల ప్రోత్సాహక నగదు అందజేశామని అన్నారు. క్రికెటర్ సిరాజ్కు ఎన్నో మినహాయింపులతో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. పారా అథ్లెట్, వరంగల్ బిడ్డ జివాంజీ దీప్తికి ఇంటి స్థలం, రూ.25 లక్షలు ఇచ్చామని పేర్కొన్నారు.
26.50లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం అని చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ వచ్చి ఉంటే కాంగ్రెస్కు ఓటు వేయండి అని అన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని విమర్శించారు. ఆ అప్పులకు ప్రతి నెలా రూ.600 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాలేదని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిచేశామన్నారు. వందేళ్లుగా జరగని కులగణనను సమర్థంగా నిర్వహించాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.